యేసుతో ప్రతి ఉదయము:-
ఈరోజు దేవుని వాగ్దానము:-
నేను నీతో చెప్పియున్నాను;నీకు తోడైయున్నాను,భయపడకుము. యెషయా 41:9-10
ఒంటరితనం – ఒక నిజమైన పోరాటం

భూమ్యాకాశములను సృష్టించిన దేవుడు తానే మనతో తోడైయున్నాడు అనునది బైబిల్ సత్యము.ఒక కన్యక గర్భవతియై కుమారుని కనును; అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. ఈ యెషయా ప్రవచనము చరిత్రగా మారెను.యోసేపునకు ప్రధానము చేయబడిన మరియ అను కన్యక పరిశుద్దాత్మవలన గర్భవతియై కుమారుని కనెను. మత్తయి 1:18.
ఇమ్మానుయేలు అను పేరునకు దేవుడు మనకు తోడు అని అర్ధము. తండ్రి ఆత్మ స్వరూపిగా మనపై ఉండిన దేవుడు,రక్తమాంసములు గలవారై ఒక శిశువుగా జన్మించినప్పుడు కుమారునిగా మనతో కూడా ఉండెను. యెషయా 9:6 ఆయా సందర్భములలో దేవుడు – నీకు తోడైయున్నాడు అని చెప్పుటను చదువుచున్నాము.
క్రీస్తులేని ఒంటరితనము భయము తెచ్చుచున్నది. ఒంటరితనము వేదనతో కూడినది.ఒంటరితనము హృదయమును పిండివేయునంత శక్తి గలది.ఒంటరిగా నున్నవారి మీద సాతాను ఎల్లప్పుడు దాడి చేయుచున్నాడు. దేవుని బిడ్డలారా,ఎన్నడును ఒంటరిగా నుండవద్దు; ప్రభువుతో కూడా ఉండండి. “నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు ” ఆదికాండము 2:18 ఒంటరితనము – ఒంటరిగానున్నను అనే భావన మధ్య వ్యత్యాసము కలదు. చాల మంది రెండవ రకమునకు చెందిన వారైయున్నారు. “నాకెవ్వరు లేరు,నేను ఒంటరిగా నున్నాను” అని తలంచువారిని ఒప్పింపచేయుట చాల కష్టము.
మనము ఒంటరిగా నున్నపుడు -ప్రభువు నాతో కూడా ఉన్నాడు అని విశ్వసించవలెను. కొన్నిసార్లు కుటుంబసభ్యుల మధ్య ఐఖ్యతలేని కారణమున ఒంటరితనమును ఎదుర్కొనవలసి ఉంటుంది. ఒకరితోనొకరు మాట్లాడుకొనని పక్షమున అందరు కలసియుండినను అందరు ఒంటరిగానున్నట్లు ఆవేదన చెందుదురు. ఒంటరితనము నిరుపేదల మధ్యనే ఉన్నదని తలంచవద్దు. ధనవంతులు సహితము విలపించుచున్నారు. “నాకు విస్తారమైన ధనధాన్యాదులు ఉండినను ప్రయోజనమేమి? మా కుటుంబీకులు నన్ను ప్రేమించుటలేదు. నాబంధుమిత్రుల మధ్య వారి ప్రేమను కోరుతూ ఏకాకిగా నిలచియున్నాను”.
ONE YEAR BIBLE READING PLAN:-
సంఖ్యాకాండము 7-8 అధ్యాయములు సారాంశము
సంఖ్యాకాండము 7వ అధ్యాయము: ఇశ్రాయేలీయుల నాయకుల కానుకలు
ఈ అధ్యాయం బైబిల్లో అత్యంత సుదీర్ఘమైన అధ్యాయాలలో ఒకటి. సమాజపు గుడారమును (Tabernacle) ప్రతిష్ఠించిన తర్వాత, ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల నాయకులు దేవునికి అర్పించిన కానుకల గురించి ఇది వివరిస్తుంది.
సమర్పణ: మోషే సమాజపు గుడారమును ప్రతిష్ఠించి, దానికి అభిషేకం చేసినప్పుడు, ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల ప్రధానులు తమ కానుకలను అర్పించారు.
కానుకలు: ప్రతి గోత్రం నాయకుడు సమానమైన కానుకలను అర్పించారు:
ఆరు బండ్లు మరియు పన్నెండు ఎడ్లు (లేవీయుల సేవ కోసం).
బలి అర్పణల కోసం వెండి పళ్ళెములు, పాత్రలు, ధూపద్రవ్యము మరియు పశువులు.
దేవుని సమాధానం: దేవుడు మోషేతో మాట్లాడుతూ, నాయకులు అర్పించిన ఈ కానుకలను స్వీకరించి, వాటిని లేవీయులకు అప్పగించమని చెప్పారు.
సంఖ్యాకాండము 8వ అధ్యాయము: లేవీయుల శుద్ధీకరణ మరియు సేవ
ఈ అధ్యాయం లేవీయులను దేవుని సేవ కోసం ప్రత్యేకించడం మరియు వారి బాధ్యతల గురించి వివరిస్తుంది.
దీపారాధన: అహరోను గుడారంలో ఉన్న దీపవృక్షం (Menorah) మీద దీపాలను వెలిగించడం ద్వారా ఆజ్ఞను నెరవేర్చాడు.
లేవీయుల ప్రతిష్ఠ: లేవీయులను ఇశ్రాయేలీయుల నుండి వేరు చేసి, శుద్ధి చేసి, దేవుని సేవకు అప్పగించారు.
వారిని శుద్ధి చేయడానికి వారిపై పాప పరిహారార్థజలమును చల్లడం, శరీరంపై ఉన్న రోమములను గొరిగించుకోవడం మరియు బట్టలను ఉతుక్కోవడం వంటి ఆచారాలు నిర్వహించారు.
ఇశ్రాయేలీయులందరి తరపున అహరోను లేవీయులను దేవునికి అర్పితముగా (Wave Offering) సమర్పించాడు.
సేవా కాలం: లేవీయులు 25 ఏళ్ళ వయస్సు నుండి 50 ఏళ్ళ వయస్సు వరకు సమాజపు గుడారంలో పని చేయాలని, ఆ తర్వాత వారు విశ్రాంతి తీసుకోవచ్చని దేవుడు ఆజ్ఞాపించాడు.
ఈ అధ్యాయాలు దేవుని మందిరానికి సంబంధించి క్రమశిక్షణ, అర్పణల పట్ల భక్తి మరియు దేవుని సేవకు పరిపూర్ణమైన సిద్ధపాటు అవసరమని తెలియజేస్తున్నాయి.
