ప్రాణాలకే తెగించించిన సేవకుడు
అడోనీరామ్ జడ్సన్(1788-1850)

సంఘకాపరి ఇంటి ముంగిట చేరిన చిన్న పిల్లలందరూ “వెళ్లి నా సువార్తను ప్రకటించుడని ప్రభువు చెప్పెను” అను పాట పాడుతున్నారు.ఇది సండేస్కూల్ తరగతియో లేక పిల్లల ప్రత్యేక కార్యక్రమమో అని మీరనుకుంటున్నారేమో! చూడండి,వారిలో నాలుగేండ్ల బాలుడు అక్కడున్న కుర్చీపై నిలబడి గంభీరమైన ప్రసంగం చేయ మొదలు పెట్టాడు.ఆ బాలుడు సంఘకాపరి కుమారుడు ఆడోనిరామ్ జడ్సన్.వీరందరు ఆదివారపు ఆరాధన క్రమాన్ని అనుసరిస్తూ ఆటగా ఆడుతున్నారు.
బాల్యం – విద్యార్థి దశ :-
1788 సంవత్సరము ఆగష్టు నెల తొమ్మిదవ తెదీన జన్మించిన అడోనిరామ్ జడ్సన్ పువ్వు పుట్టగానే పరిమళించునన్నట్లు బాల్యం నుండియే అసాధారణ ప్రతిభను చూపేవాడు.
మూడేళ్లకే చదువును నేర్చుకొన్న జడ్సన్ బైబిల్ ల్లోని ఒక అధ్యాయమంతా చదవటం చూసి తండ్రి ఆశ్చర్యభరితుడయ్యాడు పదేళ్లకే వయస్సులో గణితశాస్త్రం,లాటిన్,గ్రీకు భాషల్లో పాండిత్యం పొంది పెద్దలకే అంతుపట్టని వేదాంత గ్రంధాల్ని పఠించేవాడు. పంతొమ్మిదవ సంవత్సరాల వయస్సు వచ్చేసరికే —-విశ్వవిద్యాలయంలో ప్రధముడుగా ఉతీర్ణుడయ్యాడు. కళాశాలలో చదివే రోజుల్లో తనలాగే ప్రతిభావంతుడైన మరో విద్యార్థితో గాఢమైన స్నేహమేర్పడినది. ఈ విద్యార్థి పరిశుద్ధ లేఖనాన్ని అందలి అద్భుతాన్ని ఏమాత్రం నమ్మని నాస్తికుడు స్నేహితుని తార్కికవాదనకు ప్రభావితుడైన అడోనిరామ్ జడ్సన్ మానవులెవరు దేవుని వ్యక్తిగతంగా ఎరిగి ఉండటం అసాధ్యమనే తలంపుతో దేవునికి దూరమవడం ప్రారంభించారు. పట్టబద్రుడయ్యాక తానొక నాయ్యవాదిగానో ,నాటక రచయితగానో ఖ్యాతి పొందాలనే కాంక్షతో ఒక నాటక సమాజంలో చేరాడు. కుమారుని ప్రవర్తన తల్లిదండ్రులకెంతో వేదన కలిగించింది.
ప్రభుసాన్నిధ్యం:-
కీర్తికాంక్షతో నిండిన జడ్సన్ కు తన జీవితము లక్ష్యరహితముగా తోచేది. నాటక సమాజంలోని జీవితం అసంతృప్తిని,అస్థిమితాన్ని కలిగించగా క్రీస్తు ప్రభువు లేని అతని జీవితం అలజడికి లోనైనది. ఒకసారోక వసతి గృహంలో బసచేయాలని వెళ్ళిన అతని గది ప్రక్కనున్న మరొక గదిలో మరణావస్థలో నున్న వ్యక్తి ఉండుట తటస్థించింది. ఆ రాత్రంతా ఆ వ్యక్తి మూల్గులు వింటూ నిద్రపట్టని జడ్సన్ తెల్లవారాక వెళ్ళి ఆ వ్యక్తి ఎవరని చూసి దిగ్బబ్రాంతి చెందాడు. మరెవరో కాదు —విశ్వవిద్యాలయంలో తనకు నాస్తికత్వాన్ని బోధించిన స్నేహితుడతడు. ప్రశాంత మరణానికి సంసిద్దముగా లేక మరణ యాతనలో మూల్గిన తన స్నేహితుని దుస్థితి అతని మనస్సు నెంతో కలత పరచగా,అడోనిరామ్ హృదయం అంతులేని క్షోభను అనుభవించింది. ఆరువారాల తరువాత క్రీస్తు ప్రభువును తన సంరక్షకునిగా అంగీకరించాడు. అప్పుడు అతని హృదయములో ఎంతో ప్రశాంతత నెమ్మది నెలకొన్నాయి .
దేవుని పిలుపు :-
ఎంతో మార్పు చెందిన జడ్సన్ జీవితంలో దేవుని సంతోషపరచడమే ప్రధానాశయం. అతని భవిష్యత్ జీవితం ఒకే ఒకే ఒక ప్రాధాన్యత సంతరించుకొన్నది. ఈ సమయంలో అతడు చదివిన ఒక పుస్తకం,బాలుడిగా తాను ఆడిన ఆట, పాడిన పాట ప్రేరణతో\జీవిత దృక్పథమే మారిన జడ్సన్ హృదయంలో విదేశాలకు మిషనరీగా వెళ్ళాలనే ఆశ మొలకెత్తి, వృక్షమై వ్యాపించింది. అమెరికా దేశంలో ఆనాడు మిషనరీ సొసైటీలనే సంస్థలు లేవు. ఎవరు పంపుతారు?ఎలా వెళ్ళాలి?ఈ ప్రశ్నల పరిష్కారానికి జడ్సన్ కు తోచిన సమాధానం ప్రార్ధన. జడ్సన్ లా విదేశాలకు మిషనరీ సేవకై వెళ్ళాలనే ఆశకలిగిన మరో నలుగురు యువకులు కలసి ప్రార్ధించడం ప్రారంభిచారు.
వారి ప్రార్ధనల నాలకించిన పరమ తండ్రి సేవకొక అవకాశాన్ని అనుగ్రహించారు. 1810 సంవత్సరంలో స్థాపించబడిన అమెరికన్ బోర్డు అఫ్ మిషన్స్ సంస్థ లండన్లో నున్న లండన్ మిషనరీ సొసైటీ వారి ద్వారా అమెరికా మిషనరీలు విదేశాలలో సేవకై వెళ్ళే అవకాశాన్ని గురించి తెలిసికొనడానికై అడోనిరామ్ జడ్సన్ ను బ్రిటన్ కు పంపించారు.
బ్రిటన్,ఫ్రాన్స్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న దినాలవి. జడ్సన్ ప్రయాణిస్తున్న నౌకను ఫ్రెంచివారు స్వాధీనం చేసుకొని ప్రయాణికుల్నిచెరసాలలో వేశారు. మురికి కూపం లాంటి జైలు గదిలో నిర్బంధింపబడిన తోటి ఖైదీలకు క్రీస్తు ప్రభువును గురించి ఫ్రెంచి భాషలో చెప్పలేనందున అతడెంతో నిరాశచెందాడు. హఠాత్తుగా అపరిచిత అమెరికా దేశీయుడు ఒకనాడు జైల్లో ఉన్న జడ్సన్ ను తన పొడవైన మిలటరీ కోటులో దాచుకోని బయటకు తీసుకొని వెళ్ళాడు. తీరా లండన్ చేరాక లండన్ లోని మిషనరీ సొసైటీ వారికీ తన ప్రతిపాదన అంగీకారం కాదని తెలిసికొన్న,అమెరికా మిషనరీ సొసైటీ వారు బాధ్యత వహించి తనను మిషనరీగా పంపాలని తీర్మానించారని తెలుసుకొని ఎంతో సంతోషించారు.
క్రొత్త ప్రదేశంలో:-
ఆన్ హేజల్ టైన్ అను యువతిని 1812 సంవత్సరము వివాహమాడిన జడ్సన్,వెంటనే భారతదేశలో సేవకై పయనించాడు. ఆ దినాల్లో భారతదేశాన్ని పాలిస్తున్న ఈస్టిండియా కంపెనీవారు ఇక్కడ మిషనరీ సేవకు ప్రోత్సహించేవారు కాదు. నాలుగు నెలల సముద్ర ప్రయాణం చేసి భారతదేశం చేరిన జడ్సన్ దంపతుల్ని ఈస్టిండియా ప్రభుత్వం వారు వెంటనే వెనుతిరిగి వెళ్ళమని ఆజ్ఞాపించారు. ప్రభుత్వ ఉత్తుర్వును అందుకున్న మిషనరీల హృదయాల్లో ఎంతో నిరాశ! ఎన్నో ప్రశ్నలు! సేవకై దేవుడు మమ్ముల నిక్కడికి పిలిచాడు. కనుక వెనుతిరిగి పోకూడదని నిశ్చయించుకున్న,ప్రభుత్వాజ్ఞకు తిరస్కరించలేక భారతదేశంలోని రేవు పట్టణాల్లో ఆగుతు చివరకు రంగూన్ చేరారు. భారతదేశంలో సేవ చేయాలనుకొన్న మిషనరికి,దేవుడు తానేర్పరచిన తావు-రంగూన్ కు చేర్చాడు.
ఆనాటి-బర్మా :-
ఆ దినాల్లో బర్మా దేశమును పరిపాలిస్తున్న రాజులు నిరంకుశులై ప్రజల్ని బానిసల్లా చూసేవారు. బర్మా జాతీయ మతమైన బౌద్ధమతం జాతి జీవనంలో వ్రేళ్ళూని స్థిరత్వాన్ని సంపాదించుకొన గలిగినది. క్రీస్తు నామమెరుగని వీరి హృదయాల్లోని అశాంతితో చింతాక్రాంతులై దీన ముఖాల్తో నున్న బర్మీయుల్ని చూసినపుడు ఎంతో సానుభూతి కలిగేది. వీరందరికి వీలైనంత త్వరలో క్రీస్తు ప్రభువును గురించి తెలుపాలనే ఆశతో బర్మా భాషను నేర్చుకొనడం ఆరంభించారు. కొన్నాళ్ళు గడిచాక ప్రసవం కొరకు తన భార్యయైన ఆన్ బర్మా వదలి మద్రాసుకు రాగా జడ్సన్ ఒక్కడే భాషాభ్యాసం కొనసాగించాడు. పుట్టిన పిల్లవాడు ఎనిమిదవ నెలలో మరణించాడు.
కృషి:-
బర్మీయుల మాతృభాషలోనే వారికి దేవుని వాక్యమందించ గలిగినపుడు అనేకుల రక్షణ పొందగలరని విశ్వసించిన జడ్సన్,బైబిల్ చేతి ముద్రణా యంత్ర సహాయంతో బైబిల్ భాగాలూ,కరపత్రాలు ముద్రించేవాడు కొన్నాళ్ళకు ముద్రణలో శిక్షణ పొందిన హ్యూ అనే మిషనరీ భార్యాసమేతంగా వచ్చి సేవలో సహకరించాడు. రెండేళ్ళు సేవ చేసి నిరాశగా ఫలితం లేదనుకొంటున్న తరుణంలో క్రైస్తవ వాఙ్మయం కావాలని ఒక వ్యక్తి వచ్చాడు . అప్పటికి మత్తయి సువార్తలో ముద్రింపబడిన 5 పేజీలను ఆ వ్యక్తికి ఇచ్చారు.
ఒక బహిరంగ సభాస్థలి ఏర్పాటు చేసుకొని జడ్సన్ వారి మాతృభాషలో బర్మీయులకు బోధించేవాడు .రాత్రిళ్ళు ఆ ప్రజల నిమిత్తం ఎంతోసేపు ప్రార్థించేవాడు . ఫలితంగా ఆరుగురు బౌద్ధ సన్యాసులతో పాటు ఎందరో ఆసక్తి చూపేవారు. ఆరేళ్ల తర్వాత మౌంగ్ నౌ అను వ్యక్తి బాప్తిస్మం తీసుకొని బహిరంగముగా తన విశ్వాసాన్ని ప్రకటించుటకు ముందుకు వచ్చాడు.
హింసయైన,మరణమైన బెదరక తన నూతన విశ్వసంలో నిలచిన ఆ వ్యక్తిని చూచి ఇతరులు కూడా క్రీస్తు ప్రభువును తమ స్వరక్షకుడిగా అంగీకరించటతో 18 మంది సభ్యులు గల క్రైస్తవ సంఘమక్కడ ఏర్పడినది. ఆ సమయంలో అనారోగ్య పీడితులైన ఆన్ ను అమెరికా పంపించి అడోనిరామ్ తన సేవను కొనసాగిస్తూ నూతన నిబంధన అనువాదం పూర్తిచేశాడు. మరో క్రొత్త రాజు రాజ్యాన్నేలుట ప్రారంభిచినందున,తన సేవ కొనసాగించననుమతి పొందుటకు జడ్సన్ ఆయనను దర్శించావేళ్ళాడు.
చెఱసాల:-
బ్రిటన్,బర్మాదేశాల మధ్య యుద్ధం జరుగుతున్నందున,విదేశీయుల నందరిని వేగులవారని అనుమానించేవారు. క్రొత్తరాజును దర్శించటానికి వెళ్ళిన జడ్సన్ దంపతులను సాదరంగా ఆహ్వానించే వారు లేకపోగా,జడ్సన్ ను బంధించి చెరసాలలో వేశారు. దుర్గంధ భూయిష్టమైన ఆ జైలులో వారు పెట్టే హింసల్ని సహిస్తూ జడ్సన్ ఇరవై నెలలు గడిపారు. కాళ్లను బంధించి,ఒక కొయ్యకు తల క్రిందులుగా వ్రేలాడ తీసేవారు. ఉదయం కొద్దిసేపు బంధాలు తీసి ఆరుబయట వ్యాయామానికై వదిలి మరల యథారీతిగా వ్రేలాడదీసేవారు. ఒళ్ళంత పుండులా సలుపుతున్నా ,త్రాగటానికి మంచినీళ్ళు కూడా లేకుండా ఖైదీలు ఆలా ఉండాల్సిందే!ఆన్ భర్తకు నీళ్లు,ఆహారం రోజూ తెచ్చి ఇస్తూ భర్తను విడుదల చేయమని అధికారులను బ్రతిమాలుకొనేది. చివరకు చెరసాల ఆవరణలో నున్న ఒక గుడిసెలో జడ్సన్ ను ఉంచారు.
తననువదించిన క్రొత్త నిబంధన ప్రతుల్ని బర్మా అధికారులు నాశనం చేస్తారేమోనను భయంతో వాటన్నిటిని దిండులా కుట్టి చెఱసాలలో నున్న భర్తకు అందించిన ఆన్. జడ్సన్ దానినెంతో జాగ్రత్తగా చూసుకొనేవాడు. భర్త చెఱసాలలో నుండగా పుట్టిన కుమార్తెను చూపటానికై ఆన్ చెఱసాలకే ఆ బిడ్డను తెచ్చింది. మనస్సు మార్చుకున్న అధికారులు జడ్సన్ ను మరలా చీకటి కొట్టులో బంధించారు. కొంతకాలానికి ఖైదీల్లోని కొందరిని ప్రక్క గ్రామానికి పంపారు. వారితో జ్వరంతోబాధపడుతూ, రక్తం కారుతున్న పాదాలతో అంతదూరం నడిచి వెళ్ళాడు. జడ్సన్ పసిబిడ్డ నెత్తుకొన్న ఆన్ భర్త వెంబడి ఆ గ్రామాన్ని చేరుకొన్నది. దయతలచిన అధికారులు సమీపంలోనున్న ధాన్యం కొట్లో ఆమె ఉండటానికి అనుమతినిచ్చారు
మరణవేదన:-
ఇరవై నెలలు చెఱసాలలో మ్రగ్గిన అడోనిరామ్ ను విడుదలచేస్తూ ప్రభుత్వానువాదకునిగా సహాయపడమని కోరారు. ప్రభుత్వంవారు. ఆరువారాలపాటు ఆ పనిలో తోడ్పడి ఇంటికి వెళ్ళిన జడ్సన్ ఇంటిలో హృదయ విదారకమైన పరిస్థితుల నెదుర్కొనవలసి వచ్చింది. ఒక గదిలో చిక్కి శల్యావశిష్టమైన కుమార్తెతో బర్మాస్త్రీ మరొక గదిలో తీవ్రమైన జ్వరంతో ఆన్ పడియున్నారు.
ఆన్ కొద్దిగా కోలుకున్నాక ఆమ్ హేర్ స్టకు తమ మకాం మర్చి,ఆన్ నక్కడ వదిలి తిరిగి అవా వెళ్ళాడు. బ్రిటిష్ కమిషనర్ కు సహాయపడుతున్న సమయంలో జ్వరపీడితురాలైన ఆన్ భర్త కొరకెదురు చూస్తూ మరణించినదను వార్త చేరినది. కష్టాలెప్పుడు ఒకటిగరావు కదా ! కొన్నాళ్ళలో చిన్న కుమార్తె కూడా తల్లిని వేదుక్కొంటు వెళ్ళింది. శారీరక బలహీనత, మానసిక వేదన క్రుంగదీయగా మానవ సంచారమే లేని అరణ్యంలో చిన్న గుడిసెలో కొంతకాలం నివసించాడాయన. వీటన్నిటి ద్వారా ప్రభువు సానిధ్యాన్ని పొందుతున్నానని ఎరిగిన ఆ దైవజనుడు దేవుని ఏనాడూ ఇదేమని ప్రశ్నించలేదు. తన నివాసాన్ని మౌల్మ్ న్ కు మార్చుకొని యాదరితీగా సేవను ప్రారంభించారు. 1840సంవత్సరాల నాటికి బర్మా బాషలోనికి బైబిల్ అనువాదం పూర్తిచేసి 100మందికి పైగా బాప్తిస్మములిచ్చాడు నిరంతర శ్రమల,వేదనల వలన శుష్కించిన జడ్సన్ ను చూసి వైద్యులు క్షయవ్యాధి అంకురించిందని చెప్పారు. ముఫైమూడు సంవత్సరాల అనంతరం మొదటిసారిగా తన మాతృమూర్తిని దర్శించాడు జడ్సన్. ఎక్కువ కాలం అక్కడ ఉండలేక తానెంతో ప్రేమించిన బర్మాకు తిరిగివచ్చిన జడ్సన్ తన స్వదేశాన్ని మరెన్నడు చూడకనే పరమపదించాడు. బర్మా భాషలో నిఘంటువును పూర్తి చేశాక ఆరోగ్యం మరీ క్షిణించినందున ఆరోగ్యానికై సముద్ర ప్రయాణం ప్రారంభించి 1850 సంవత్సరము సముద్రములోనే సమాధి చేయబబడ్డాడు.
“సిలువను స్థిరముగా ఇక్కడ స్థాపించే వరకు నేవీ ప్రాంతాన్ని విడవని” యౌవనోద్రేకములో పలికిన మాటలు అయన జీవితములో సాధించగలిగాడు.ముపై సంవత్సరాల సేవ ఫలితంగా బర్మాలో 63 సంఘాల్లోని 7000 మంది విశ్వాసుల మధ్య 163 మంది మిషనరీలు బర్మాలో పనిచేస్తున్నారు క్రీస్తు ప్రభువును తమ స్వరక్షుకునిగా అంగీకరించనివారు. నిత్యనరకానికే పాత్రులని విశ్వసించని అడోనిరాం. స్వసుఖాలని స్వజనులను,వదలి శ్రమ బాధల కంటవృతమైన సేవపదాన్నెన్నుకొన్నాడు.
క్రైస్తవ సోదరా!సోదరి! క్రైస్తవుల మని చెప్పుకుంటున్న మనం క్రీస్తు నామమెరుగని మన బంధుమిత్రుల కొరకు,ఇతర జాతుల వారి కొరకేమీ చేస్తున్నాము?క్రీస్తు నామమెరుగని వారి మధ్య సేవకై దేవుడు నిన్ను రమ్మని కోరితె వెళ్ళుట కిష్టపడుదువా?

Leave a Reply