యేసుతో ప్రతి ఉదయము-DAY26-“నిశ్శబ్దంలో నిలిచిన నేస్తం”
యేసుతో ప్రతి ఉదయము:-
ఈరోజు దేవుని వాగ్దానము:-
యెషయా 41:10
నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.

ఒంటరితనము అనేది కేవలము మనుషులు చుట్టూ లేకపోవడం కాదు. మనల్ని అర్థం చేసుకునే వారు లేరని భావన. కానీ బైబిల్ చెప్తుంది, తల్లి తన బిడ్డను మరచిన ఆయన మనల్ని మరువడు.
యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు, దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు, షడ్రుకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు దేవుడు వారికి “తోడై”ఉన్నాడు.
ఆయా సందర్భంలో దేవుడు నీకు- తోడైయున్నాను అని చెప్పటం చదువుతున్నాము క్రీస్తు లేని ఒంటరితనము భయమును తెచుచున్నది. ఒంటరితనము వేదనతో కూడినది . ఒంటరితనము హృదయమును పిండి వేయునంత శక్తి గలది. ఒంటరిగానున్న వారి మీద సాతాను ఎల్లప్పుడూ దాడి చేయుచున్నాడు.దేవుని బిడ్డలారా, ఎన్నడును ఒంటరిగా ఉండవద్దు; ప్రభువుతో కూడా ఉండండి
దైవ ప్రసన్నతను కలిగి ఉండండి. మీతో కూడా దేవదూతలు ఉన్నారు. “నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు”. ఆదికాండము 2: 18
ఒంటరితనము – ఒంటరిగా ఉన్నాను అనే భావన మధ్య వ్యత్యాసం కలదు. చాలా మంది రెండవ రకమునకు చెందిన వారై ఉన్నారు “నాకు ఎవరు లేరు, నేను ఒంటరిగానున్నాను అని తలంచువారిని ఒప్పింప చేయుట చాలా కష్టం.
మనము ఒంటరిగా ఉన్నప్పుడు- ప్రభువు నాతో కూడా ఉన్నాడు అనే విశ్వసించవలెను. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేని కారణమున ఒంటరితనమును ఎదుర్కొనవలసి ఉంటుంది. ఒకరోతోనొకరు మాట్లాడుకొనని పక్షమున అందరూ కలసిఉండినను అందరు ఒంటరిగా ఉన్నట్లు ఆవేదన చెందుతారు. ఒంటరితనం నిరుపేదల మధ్యనే ఉన్నదని తలంచవద్దు. ధనవంతుల సహితము విలపించుచున్నారు.”నాకు విస్తారమైన ధన ధాన్యములు ఉండినను ప్రయోజనమేమి? మా కుటుంబంలో నన్ను ప్రేమించుటలేదు. నా బంధుమిత్రుల మధ్య వారి ప్రేమను కోరుతూ ఏకాకిగా నిలిచి ఉన్నాను.
రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలేనున్నాను కీర్తనలు 102:7
“నిశ్శబ్దంలో నిలిచిన నేస్తం” (The Friend in the Silence)
ఒక చిన్న కథ:-
ఒక ఊరిలో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు బంధువులెవరూ లేరు, అనారోగ్యం వల్ల బయటకు వెళ్లలేక ఇంట్లోనే ఒంటరిగా గడిపేది. ఆమె ఇంటి పక్కన ఒక యువకుడు ఉండేవాడు. ఆమె ఎప్పుడూ తన గదిలో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు అతనికి అనిపించేది.
ఒకరోజు అతను ధైర్యం చేసి ఆమెను అడిగాడు, “అమ్మా, మీ ఇంట్లో ఎవరూ లేరు కదా, మీరు ఎవరితో అంత సేపు మాట్లాడుతుంటారు?” అని.
ఆమె నవ్వుతూ తన పక్కనే ఉన్న ఒక ఖాళీ కుర్చీని చూపించి ఇలా అంది: “బాబు, చాలా ఏళ్ల క్రితం నేను ప్రార్థన చేయలేక ఇబ్బంది పడుతుంటే, ఒక దైవ సేవకుడు నాకు ఒక సలహా ఇచ్చాడు. ‘ప్రార్థన అంటే ఏదో కష్టమైన పని కాదు, నీ ఎదురుగా ఒక ఖాళీ కుర్చీ వేసుకో, అందులో యేసుప్రభువు కూర్చున్నారని ఊహించుకో.. నీ మనసులో ఉన్నవన్నీ ఆయనతో చెప్పు’ అని చెప్పారు. అప్పటి నుండి ఈ ఖాళీ కుర్చీ నాకు ఖాళీగా అనిపించదు. నా యేసు నా పక్కనే కూర్చుని నా మాటలు వింటున్నారని నాకు తెలుసు. అందుకే నాకు అస్సలు ఒంటరితనం అనిపించదు.”
కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రశాంతంగా మరణించింది. ఆ సమయంలో ఆమె తల ఆ ఖాళీ కుర్చీ మీద వాలి ఉందట. అంటే, చివరి శ్వాస వరకు ఆమె తన దేవుని ఒడిలోనే ఉందన్నమాట.
గొప్ప పలుకులు & సేవకుల మాటలు
- బిలీ గ్రాహం: “దేవుడు తన బిడ్డలను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టడు, ఆయన మౌనంగా ఉన్నాడంటే అర్థం ఆయన మీ కోసం ఏదో గొప్ప కార్యం సిద్ధం చేస్తున్నాడని.”
- సి.హెచ్. స్పర్జన్: “ప్రభువు తోడు ఉన్నప్పుడు, అరణ్యం కూడా పరలోక ద్వారంలా మారుతుంది.”
ప్రార్థన:-
ప్రేమగల తండ్రి, ఈ రోజు ఈ వాక్యం చదువుతున్న బిడ్డలను ఆశీర్వదించండి. ఎవరైతే ఒంటరితనంతో, ఆవేదనతో, నిరాశతో ఉన్నారో వారి హృదయాలను తాకండి. “నేను నీకు తోడై ఉన్నాను” అన్న నీ వాగ్దానాన్ని వారి జీవితాల్లో నెరవేర్చండి. కుటుంబాల్లో ఐక్యతను ఇవ్వండి. మనుషుల ప్రేమ కంటే మిన్నయైన నీ దివ్య ప్రేమతో మమ్మల్ని నింపమని, యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.
ONE YEAR BIBLE READING PLAN
నిర్గమ కాండము 25-27 అధ్యాయములు
