యేసుతో ప్రతి ఉదయము-DAY 31-ఎడారి జీవితంలో వసంతం
యేసుతో ప్రతి ఉదయము:-
ఈరోజు దేవుని వాగ్దానము:-
“అరణ్యమును, ఎండిన భూమియు సంతోషించును కస్తూరి పుష్పము వలే పూయును పోయును. అది బహుగా పూయుచు ఉల్లసించును.ఉల్లసించి సంగీతమును పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మెలు షారోనులకున్న సోగసు దాని కుండును. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.” యెషయా 35 :1, 2
“ఎడారి జీవితంలో వసంతం “

మన పాపము వల్ల ఏర్పడిన ఎడారి వంటి నిష్ఫలమైన జీవితాన్ని, దేవుడు తన కృపతో ఎలా ఒక అందమైన నందనవనంగా మార్చగలడో మనకు తెలియజేస్తుంది.
ప్రభువును తన సంతోషమును ఎంత సామాన్యముగను,ఎంత సౌందర్యముగను క్లుప్తపరచి యున్నాడో చూడుడి. ఒక మనుష్యుని అవిధేయత ద్వారా పాపము ఈ లోకంలో ప్రవేశించినప్పుడు అది శాపమును తీసుకొని వచ్చెను.
ఆ శాపము వలన ముండ్లు, గచ్చపొదలు ,నిశ్ఫల స్థితి, నిరాశ స్థితి ప్రతి చోట కనిపించుచున్నవి తన విద్యా పురోగమనము, సంస్కృతి మీద ఆధారపడి మానవుడు ఏమి చేయజూచినను. కేవలం ముళ్ళు,గచ్చపొదలు,ఎడారి ఇసుకగా మాత్రమే మిగిలిపోవును.
ప్రతి గృహమునందు ముళ్ళు గచ్చు కథలు కలవు.
ఏ మానవుని ద్వారా కూడా మార్చబడుటకు గాని, మెరుగుపరుచుటకు గాని వీలుకాని నిష్ఫలమైన ఎడారి గానే నీ జీవితము ఉన్నది. అయితే దేవుడేమీ చెప్పుచున్నాడో చూడుము. అడవి …. కస్తూరి పుష్పము వలె పూయుచు ఉల్లసించును,ఉల్లసించి సంగీతములు పాడును.” దేవుని కృప వలన కలుగు అద్భుతమిదియే. మన జీవితములలో గొడ్డుబారినవి గాను నిష్ఫలములుగాను అగుటకు కారణమైన పాపమును క్షమించుట మాత్రమే గాక ఆయన తన ప్రేమ ద్వారా నిశ్ఫల జీవితమును ఎండిన జీవితమును కస్తూరి వనముగా చేయుటకు ఇష్టపడుతున్నాడు.
చిన్న కథ:-
బైబిల్లో సమరయ స్త్రీ జీవితాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆమె జీవితం పాపముతో నిండిన ఒక ఎడారి లాంటిది. సమాజంలో గౌరవం లేక, మనశ్శాంతి లేక మధ్యాహ్నం వేళ ఒంటరిగా నీటి కోసం వచ్చిన ఆమెకు ‘జీవజలమైన’ యేసుక్రీస్తు పరిచయమయ్యారు.
యేసు ఆమె పాపములను క్షమించి, ఆమె అంతరంగమును మార్చినప్పుడు, ఎండిపోయిన ఆమె జీవితం వెంటనే ఉల్లసించింది. ఎవరికైతే భయపడి దాక్కుందో, అదే ప్రజల వద్దకు వెళ్లి ఆమె ఒక గొప్ప సాక్షిగా మారింది. ఆమె హృదయం ఒక కస్తూరి పుష్పం వలె పూసి, ఆ ప్రాంతమంతా సువార్త పరిమళాన్ని వెదజల్లింది. మన జీవితం ఎంత ఎండిపోయినా, ఆయన తాకితే చాలు అది ఫలభరితంగా మారుతుంది.
గొప్ప పలుకులు
- “మానవ ప్రయత్నం ఎడారి ఇసుకను మాత్రమే మిగిల్చగలదు, కానీ దేవుని కృప ఆ ఇసుకలోనూ పూదోటను నిర్మించగలదు.”
- “నీ జీవితంలో ముళ్లు, గచ్చపొదలు నీ పాపానికి గుర్తులు కావచ్చు; కానీ కస్తూరి పుష్పాలు దేవుని క్షమాపణకు చిహ్నాలు.”
- “సంగీతం లేని ఎడారి లాంటి నీ బ్రతుకులో, దేవుడు స్తుతి గీతాన్ని నింపబోతున్నాడు.”
ప్రార్ధన:-
పరిశుద్ధుడవైన మా తండ్రీ, ఈ ఉదయకాలము నీ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ప్రభువా, మా అవిధేయత వల్ల, పాపం వల్ల మా జీవితాలలో ఏర్పడిన ఎడారి పరిస్థితులను నీవు చూస్తున్నావు. మా గృహాలలో ఉన్న ముళ్ళను, గచ్చపొదలను తొలగించుము. నీ కృపతో మా ఎండిన జీవితాలను కస్తూరి వనముగా మార్చుము. మా హృదయాలలో రక్షణ ఆనందాన్ని, కొత్త సంగీతాన్ని నింపుము. నీ మహిమను మా జీవితాల్లో చూచునట్లు మమ్ములను దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రీ. ఆమేన్.
ONE YEAR BIBLE READING:
నిర్గమకాండము 39-40 అధ్యాయములు
